Saggubiyyam Kesari : సగ్గుబియ్యంతో మనం వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సగ్గుబియ్యంతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యంతో మనం సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో సగ్గుబియ్యం కేసరి కూడా ఒకటి. సగ్గుబియ్యంతో చేసే ఈ కేసరి చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు అలాగే పండగలకు ఇలా సగ్గుబియ్యంతో సులభంగా కేసరిని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ సగ్గుబియ్యం కేసరిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యం కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన చిన్న సగ్గుబియ్యం – ఒక కప్పు, నీళ్లు – 2 గ్లాసులు, నెయ్యి – ఒక టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, పంచదార – అరకప్పు, ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చకర్పూరం – చిటికెడు.
సగ్గుబియ్యం కేసరి తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నీటిని వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత సగ్గుబియ్యం వేసి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ సగ్గుబియ్యాన్ని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ సగ్గుబియ్యంలో అర టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో ఉడికించిన సగ్గుబియ్యం వేసి వేయించాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత పంచదార వేసి కలపాలి.
పంచదార కరిగే వరకు కలుపుతూ ఉడికించాలి. పంచదార కరిగిన తరువాత ఫుడ్ కలర్, యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో 2 టీ స్పూన్ల నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం కేసరి తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన కేసరిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.