Capsicum Perugu Pachadi : క్యాప్సికం పెరుగు ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Capsicum Perugu Pachadi : క్యాప్సికం పెరుగు ప‌చ్చ‌డి.. క్యాప్సికం మ‌రియు పెరుగు క‌లిపి చేసే ఈ పెరుగు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లో క్యాప్సికం ఉంటే చాలు 10 నిమిషాల్లో ఈ పెరుగు ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట‌చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా పెరుగు ప‌చ్చ‌డిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ క్యాప్సికం పెరుగు ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాప్సికం పెరుగు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చిమిర్చి – 3, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, పెరుగు – అర లీట‌ర్, ఉప్పు – త‌గినంత‌.

Capsicum Perugu Pachadi recipe very tasty with rice how to make it
Capsicum Perugu Pachadi

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు…

నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – చిటికెడు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

క్యాప్సికం పెరుగు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా రోట్లో ప‌చ్చిమిర్చి, కొత్తిమీర వేసి క‌చ్చా ప‌చ్చ‌గా దంచుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి వేయించాలి. ఇందులోనే ప‌సుపు వేసి క్యాప్సికం ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత గిన్నెలో పెరుగును తీసుకుని ఉండ‌లు లేకుండా చేసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, దంచుకున్న ప‌చ్చిమిర్చి మిశ్ర‌మం, వేయించిన క్యాప్సికం ముక్క‌లు వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు ప‌దార్థాలు వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత దీనిని పెరుగులో వేసి కలిపి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం పెరుగు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన పెరుగు ప‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts