Sajja Laddu : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాలలో సజ్జలు కూడా ఒకటి. ఇతర ఇరుధాన్యాల లాగా ఇవి కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. సజ్జలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సజ్జలతో మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలను తినడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. ఎంతో రుచిగా సజ్జలతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సజ్జ లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
సజ్జ పిండి – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, జీడిపప్పు పలుకులు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, నువ్వులు – కొద్దిగా, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక గ్లాసు.
సజ్జ లడ్డూల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత జీడిపప్పు పలుకులను, ఎండు ద్రాక్షను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో నువ్వులను కూడా వేసి రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఒక గిన్నెలో సజ్జ పిండిని తీసుకుని అందులో చిటికెడు ఉప్పును వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి పెద్ద ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్దను తీసుకుంటూ పాలిథీన్ కవర్ మీద ఉంచి చేతులకు నెయ్యిని రాసుకుంటూ మందంగా చపాతీలా ఒత్తుకుని పెనం మీద వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకున్న తరువాత వీటన్నింటనీ ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే బెల్లం తురుమును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా వేయించిన నువ్వులను, డ్రై ఫ్రూట్స్ ను వేసి కలిపి కావల్సిన పరిమాణంలో ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సజ్జ లడ్డూలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 10 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకు ఒకటి లేదా రెండు లడ్డూల చొప్పున తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.