Vayinta Chettu : మన చుట్టూ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉండనే ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఔషధ గుణాల గురించి, వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక మనం ఆ మొక్కలను ఉపయోగించలేకపోతున్నాం. అలాంటి మొక్కలలో వాయింట చెట్టు కూడా ఒకటి. దీనిలో పచ్చ వాయింట, తెల్ల వాయింట అని రెండు రకాలు ఉంటాయి. ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దీని ఆకులను పూర్వకాలంలో కూరగా చేసుకుని తినే వారు. అనేక రోగాలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ రోగాలను, గడ్డలను నయం చేయడంలో వాయింట మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. వాయింట చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి, దాని ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాయింట చెట్టును వావింట, వామింట అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క కారం రుచితో వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. పక్షవాతాన్ని, గుండె జబ్బులను, క్రిమిరోగాలను, కఫ రోగాలను, చెవి రోగాలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది. చలి గాలులకు చలి వాతావరణంలో పని చేసినప్పుడు కఫం చేరి కళ్ల వెంట, ముక్కు వెంట నీరు కారుతూ ఉంటుంది. అలాంటి సమయంలో వాయింట మొక్క ఆకులను మెత్తగా నూరి మాడు పై ఉంచి కట్టు కట్టాలి. కొద్ది సేపటి తరువాత తలపై ఉంచిన ముద్దను తీసి నీటిని పిండి మరలా తలపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా రెండు సార్లు చేసి ఆ ముద్దను పడేయాలి. ఈ విధంగా రెండు నుండి మూడు రోజుల పాటు చేయడం వల్ల తలలో ఉండే నీరు అంతా పోయి తలభారం, తలనొప్పి తగ్గుతుంది.
వాయింట మొక్కను సమూలంగా సేకరించి దాని నుండి రసాన్ని తీయాలి. ఆ రసానికి సమానంగా నువ్వుల నూనెను కలిపి చిన్న మంటపై కేవలం నూనె మిగిలే వరకు మరిగించాలి. ఇలా మరిగించగా మిగిలిన తైలాన్ని గోరు వెచ్చగా చర్మం పై పూతగా రాయడం వల్ల గజ్జి, తామర, చిడుము వంటి అనేక చర్మ వ్యాధులు నయం అవుతాయి. ఈ మొక్క ఆకులకు ఉప్పును కలిపి దంచి ఆ మిశ్రమాన్ని చర్మం పై రాస్తూ ఉండడం వల్ల దురదలు తగ్గుతాయి. ఎన్ని మందులు వాడినా మానని గడ్డలను కూడా వాయింట చెట్టును ఉపయోగించి మనం నయం చేసుకోవచ్చు. ఈ మొక్క ఆకులను దంచి గడ్డలపై ఉంచి కట్టుగా కట్టి మంట పుట్టిన మరుక్షణమే తీసివేయాలి. ఇలా చేయడం వల్ల మొండి గడ్డలు పగిలి త్వరగా మానుతాయి.
పరిశుభ్ర వాతావరణంలో పెరిగిన వాయింట చెట్టు ఆకులను తెచ్చి కూరగా, పప్పు కూరగా, పులుసు కూరగా వండుకుని పరిమిత మోతాదులో తినడం వల్ల జలుబు, దగ్గు, తుమ్ములు వంటి కఫ రోగాలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా వాయింట చెట్టును ఉపయోగించి మనకు వచ్చే అనేక రోగాల నుండి బయటపడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ దీనిని పూర్తిగా తెలిసిన వారి సమక్షంలో లేదా ఆయుర్వేద నిపుణుల సమక్షంలో మాత్రమే ఉపయోగించాలి. లేదంటే దుష్పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.