Sambar Podi : మనలో చాలా మంది సాంబార్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. మనం తరుచూ సాంబార్ ను తయారు చేస్తూ ఉంటాము. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా సాంబార్ ను తింటూ ఉంటారు. చాలా మంది సాంబార్ ను తయారు చేసేటప్పుడు సాంబార్ పొడిని వాడుతూ ఉంటారు. ఈ సాంబార్ పొడిని ఎక్కువగా బయట నుండి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే బయట కొనే ఈ సాంబార్ పొడి అంత చక్కటి వాసనను కలిగి ఉండదు. దీనితో చేసే సాంబార్ కూడా అంత రుచిగా ఉండవు. ఇలా బయట కొనడానికి బదులుగా మనం ఇంట్లోనే చాలా సులభంగా సాంబార్ పొడిని తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా సులభంగా, కమ్మటి వాసనతో ఇంట్లోనే సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాంబార్ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, కందిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 4 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 20, మెంతులు – అర టీ స్పూన్, కరివేపాకు – 4 రెమ్మలు.
సాంబార్ పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపప్పు, కందిపప్పు, మినపప్పు వేసి మాడిపోకుండా దోరగా వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే కళాయిలో మిగిలిన పదార్థాలు వేసి వీటిని కూడా దోరగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించిన పప్పులు కూడా వేసి మెత్తగా మిక్సీపట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సాంబార్ పొడి తయారవుతుంది. ఈ పొడి చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడి రెండు నుండి మూడు నెలల పాటు కమ్మటి వాసనతో తాజాగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పొడితో చసే సాంబార్ మరింత రుచిగా ఉంటుంది.