Schezwan Sauce : మనం వంటింట్లో నూడుల్స్, మంచురియా, ఫ్రైడ్ రైస్ ఇలా రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే వీటిలో మనం ముఖ్యంగా ఉపయోగించే పదార్థాల్లో షెజ్వాన్ సాస్ కూడా ఒకటి. ఈ సాస్ వేస్తేనే మనం చేసే వంటలు మరింత రుచిగా ఉంటాయి. బయట మనకు ఈ షెజ్వాన్ సాస్ చాలా సులభంగా లభిస్తుంది. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా మనం ఇంట్లోనే ఈ షెజ్వాన్ సాస్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చాలా సులభంగా షెజ్వాన్ సాస్ ను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
షెజ్వాన్ సాస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 150 గ్రా., నూనె -ఒక కప్పు, వెల్లుల్లి తరుగు – ఒక కప్పు, అల్లం తరుగు – ముప్పావు కప్పు, సెలరీ కాడల తరుగు – అర కప్పు, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 150 ఎమ్ ఎల్, అనాస పువ్వు పొడి – ఒక టేబుల్ స్పూన్.
షెజ్వాన్ సాస్ తయారీ విధానం..
ముందుగా ఎండుమిర్చిని నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత సెలరీ కాడల తరుగు వేసి వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఉప్పు, వెనిగర్, అనాస పువ్వు పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూతను ఉంచి మధ్యస్థ మంటపై మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షెజ్వాన్ సాస్ తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల 3 నుండి 4 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా షెజ్వాన్ సాస్ ను ఇంట్లోనే తయారు చేసుకుని ఉంచుకోవడం వల్ల ఎప్పుడుపడితే అప్పుడు మనకు కావల్సిన వంటకాలను తయారు చేసుకుని తినవచ్చు.