Semiya Saggubiyyam Payasam : మనం అప్పుడప్పుడూ వంటింట్లో సేమియా, సగ్గు బియ్యంతో ఎంతో చక్కటి పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పాయసాన్ని ఇష్టంగా తింటారు. సాధారణంగా ఈ పాయసం తయారీలో మనం పాలను ఉపయోగిస్తూ ఉంటాం. సాధారణ పాలకు బదులుగా కొబ్బరి పాలతో కూడా మనం ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పాలతో చేసే ఈ పాయసం మరింత రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కొబ్బరి పాలతో సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా సగ్గు బియ్యం పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, జీడి పప్పు – 15, ఎండు ద్రాక్ష – 15, సేమియా – ఒక కప్పు, సగ్గు బియ్యం – పావు కప్పు, వేడి నీళ్లు – 3 కప్పులు, చిన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, పలుచటి కొబ్బరి పాలు – ఒకటిన్నర కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
సేమియా సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగే వరకు తిప్పి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచాలి. ఇప్పుడు మరో కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో సేమియా, సగ్గు బియ్యం వేసి చిన్న మంటపై రంగు మారే వరకు కలుపుతూ వేయించాలి. ఇలా వేయించిన తరువాత ఇందులోనే మరుగుతున్న నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి సేమియా మెత్తగా అయ్యే వరకు 10 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత ముందుగా తయారు చేసుకున్న బెల్లం నీళ్లు పోసి కలపాలి. తరువాత పలుచగా ఉండే కొబ్బరి పాలను పోసి కలుపుతూ ఉడికించాలి. ఈ సేమియాను కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించిన తరువాత యాలకుల పొడితో పాటు ముందుగా వేయించిన కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కమ్మగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం తయారవుతుంది. ఈ విధంగా కొబ్బరి పాలు చేసిన ఈ పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు ఇలా ఎంతో రుచిగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు.