Semiya Saggubiyyam Payasam : మనం వంటింట్లో తరచూ చేసే తీపి వంటకాల్లో సేమ్యా పాయసం కూడా ఒకటి. సేమ్యా పాయసం తిన్నా కొద్ది తినాలనిపించేత రుచిగా ఉంటుంది. ఈ పాయసాన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. తరచూ ఒకే రకం సేమియా పాయసం కాకుండా దీనిని మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన సేమియా, సగ్గుబియ్యం కలిపి చేసే ఈ పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు సులభంగా ఈ పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. మరింత రుచిగా, సులభంగా సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా సగ్గు బియ్యం పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన సగ్గుబియ్యం -అర కప్పు, సేమియా – ఒక కప్పు, పంచదార – ముప్పావు కప్పు, పాలు – అర లీటర్, నీళ్లు -ఒక గ్లాస్, నెయ్యి – 2 టీ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, యాలకుల పొడి – అర టీ స్పూన్.
సేమియా సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పాలు, నీళ్లు పోసి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. పాలు వేడవుతుండగానే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో సేమియా వేసి వేయించాలి. సేమియా రంగు మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించిన సేమియాను మరుగుతున్న పాలల్లో వేసి కలపాలి. తరువాత సగ్గుబియ్యం వేసి కలపాలి. ఇప్పుడు వీటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం తయారవుతుంది. ఇందులో పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.