Semiya Tomato Dosa : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. సేమియాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో ఈ వంటకాలను తయారు చేసుకోవచ్చు. సేమియాతో తరుచూ చేసే వంటకాలతో పాటు కింద చెప్పిన విధంగా దోశలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. సేమియా, టమాటాలు కలిపి చేసే ఈ దోశలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం టిఫిన్స్ తిని బోర్ కొట్టిన వారు ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారు ఈ దోశలను తయారుచేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ సేమియా టమాట దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా టమాట దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
సేమియా – అర కప్పు, బొంబాయి రవ్వ – అర కప్పు, టమాటాలు – 3, ఎండుమిర్చి – 3, అల్లం – అర ఇంచు ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత,నీళ్లు – తగినన్ని, గోధుమపిండి – ఒక టేబుల్ స్పూన్.
సేమియా టమాట దోశ తయారీ విధానం..
ముందుగా కళాయిలో సేమియాను వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో రవ్వ వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరలా అదే కళాయిలో ఎండమిర్చి కూడా వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో ఎండుమిర్చి, రవ్వ, అల్లం, జీలకర్ర, టమాట ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే వేయించిన సేమ్యాతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలిపి అరగంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత తగినన్ని నీళ్లు పోసి రవ్వదోశ మాదిరి పిండిని కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి టిష్యూతో లేదా ఉల్లిపాయతో తుడవాలి. తరువాత గంటెతో పిండిని తీసుకుని రవ్వ దోశ మాదిరి పలుచగా వేసుకోవాలి. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా దోశను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా టమాట దోశ తయారవుతుంది. దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సేమియాతో చేసిన దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.