Shanagapappu Payasam : మన ఆరోగ్యానికి శనగపప్పు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. శనగపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ తో పాటు వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తాయి. పిండి వంటలు, చిరుతిళ్లు, కూరలే కాకుండా ఈ శనగపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. శనగపప్పు పాయసం చాలా రుచిగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సులభంగా, రుచిగా శనగపప్పుతో పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపప్పు పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక కప్పు, బెల్లం తురుము – రెండు కప్పులు, అర గంట పాటు నానబెట్టిన సగ్గుబియ్యం – పావు కప్పు, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ – తగినన్ని, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
శనగపప్పు పాయసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ లో శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టాలి. దీనిని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పప్పును కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో బెల్లం తురుము, ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి ఉడికించి పప్పులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. ఇందులోనే నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు యాలకుల పొడి, పచ్చి కొబ్బరి పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఉంచాలి. తరువాత ఇందులో పాలు, వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసి కలపాలి. ఇప్పుడు ఈ పాయసాన్ని స్టవ్ మీద ఉంచి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపప్పు పాయసం తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు, పండగలకు ఇలా శనగపప్పుతో పాయసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన శనగపప్పు పాయసాన్ని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.