Sleeping : సాధారణంగా మనలో చాలా మందికి అనేక సమస్యలు ఉంటాయి. అసలు సమస్యలే లేని వారు ఉండరు. ఎవరికైనా సరే ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉంటుంది. అలాంటివారు వాటి నుంచి బయట పడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు సమస్యలు పరిష్కారం కావాలని రకరకాల పూజలు, పరిహారాలు చేస్తుంటారు. అయితే వాస్తవానికి ఇంట్లో వాస్తు దోషాల వల్ల కూడా సమస్యలు వస్తుంటాయి. కొన్ని దోషాలను తొలగించుకోవాలంటే పూజలు, పరిహారాలు చేయాల్సిన పనిలేదు. మనం ఇంట్లో నిద్రించే దిశను మార్చుకుంటే చాలు.. వాస్తు దోషం సవరించబడుతుంది. ఇంట్లో ఒక ప్రత్యేక దిశలో నిద్రించడం వల్ల మనకు ఉండే సమస్యలు పోతాయి. సమస్యలు పోయేవారకు అలా నిర్దిష్టమైన దిశలో నిద్రించాలి. ఆ తరువాత అవసరం లేదు. ఇక ఎలాంటి సమస్యలు పోవాలంటే.. ఏ దిశలో నిద్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు దిశలో తలను ఉంచి నిద్రిస్తే ఇంట్లో సుఖ, శాంతులు వెల్లివిరుస్తాయి. ఇంట్లో మనశ్శాంతి, సుఖం లేని వారు, గొడవలు అవుతున్న వారు ఇలా నిద్రిస్తే మంచిది. వాటి నుంచి బయట పడి సంతోషంగా ఉండవచ్చు. అలాగే దక్షిణ దిశలో తలను ఉంచి నిద్రిస్తే చదువుల్లో బాగా రాణిస్తారు. దీంతోపాటు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. బాగా పేరు రావాలని కోరుకునే వారు ఇలా నిద్రించవచ్చు. ఇక ఎవరైనా ఏదైనా వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలని భావిస్తే వారు నైరుతి దిశలో తలను ఉంచి నిద్రించాలి. దీంతో వారు అనుకున్నది సాధించగలుగుతారు.
అయితే ఏ దిశలో తలను ఉంచి నిద్రిస్తే మంచి ఫలితాలను పొందవచ్చో పైన తెలుసుకున్నాం. ఇక కొన్ని దిశల్లో తలను ఉంచి నిద్రిస్తే.. ఎలాంటి చెడు ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర దిశలో తలను ఉంచి నిద్రిస్తే అనారోగ్యాల పాలు కావడమో, మరణం సంభవించడమో జరుగుతుంది. అలాగే పడమర దిక్కున తలను ఉంచి నిద్రిస్తే ఎల్లప్పుడూ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఎల్లప్పుడూ ఆందోళనలకు గురవుతుంటారు. సుఖం అన్నది లభించదు. ఇక ఈశాన్య దిశలో తలను ఉంచి నిద్రిస్తే రుణ బాధలు అధికమవుతాయి. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. దీంతోపాటు ఇంట్లో, బయట ఎవరితో అయినా సరే కలహాలు మొదలవుతుంటాయి. అలాగే ఆగ్నేయం వైపు తలను ఉంచి పడుకున్నా కూడా అప్పులు అధికమవుతాయి. ఇక వాయువ్య దిశలో తలను ఉంచి నిద్రిస్తే మెదడులో అన్నీ పిచ్చి ఆలోచనలే వస్తుంటాయి. ఏమీ పనిచేయకుండా సోమరిపోతుల్లా తిరుగుతుంటారు. బద్దకస్తులుగా ఉంటారు. ఎల్లప్పుడూ పిచ్చి పనులు చేస్తుంటారు.
ఇలా మనం తలను పెట్టి నిద్రించే దిశ లేదా దిక్కు ప్రభావం వల్ల కూడా మన జీవితం అనేది నిర్ణయించబడుతుంది. కనుక మనకు మంచి జరగాలంటే.. ఏయే దిక్కుల్లో తలను పెట్టకూడదు.. ఏయే దిశల్లో తలను పెట్టి నిద్రించాలి.. అన్న వివరాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకుని నిద్రించాలి. దీంతో సమస్యల నుంచి బయట పడేందుకు అవకాశాలు ఉంటాయి. లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.