Sorakaya Fry : మన ఆహారంగా తీసుకునే కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. దీనిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరానికి చలువ చేయడంలో, బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక విధాలుగా సొరకాయ మనకు సహాయపడుతుంది. సొరకాయతో మనం ఫ్రైను కూడా తయారు చేస్తూ ఉంటాం. సొరకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇది దేనితోనైనా తినడానికి ఈ ఫ్రై చక్కగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ సొరకాయ ఫ్రైనుకారం పొడి వేసిమరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన సొరకాయ – అరకిలో , వేయించి పొట్టు తీసిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 5 లేదా తగినన్ని, వెల్లుల్లి రెబ్బలు – 5, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
సొరకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత సొరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి సొరకాయను పూర్తిగా మగ్గించాలి.
సొరకాయ ఉడికిన తరువాత మూత తీసి అందులో ఉన్న నీరంతా పోయే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న కారం పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సొరకాయతో తరచూ చేసే వంటకాల కంటే ఈ విధంగా చేసిన ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. సొరకాయ తినని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు.