Sorakaya Pachadi : సొరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలగే సొరకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. సొరకాయతో కేవలం కూరలే కాకుండా ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ పచ్చడి తిన్నాకొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేయవచ్చు. కమ్మగా, సులభంగా సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పచ్చడి తయారీ విధానం..
తరిగిన సొరకాయ ముక్కలు – పావు కిలో, నూనె – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 8 లేదా తగినన్ని, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు – చిన్న నిమ్మకాయంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
సొరకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. దినుసులన్నీ చక్కగా వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే కళాయిలో సొరకాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి ముక్కలను మెత్తగా ఉడికించాలి. సొరకాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత మూత తీసి వాటిలో ఉండే నీరంతా ఆవిరైపోయే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో వేయించిన దినుసులన్నింటిని తీసుకోవాలి. తరువాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఉడికించిన సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కేవలం అన్నంలోనే కాకుండా అల్పాహారాలతో కూడా ఈ పచ్చడిని తినవచ్చు. సొరకాయతో ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.