Spanish Omelette : మనం కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. కోడిగుడ్లతో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. కోడిగుడ్లతో చేసుకోదగిన వాటిలో స్పానిష్ ఆమ్లెట్ కూడా ఒకటి. స్పానిష్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. అల్పాహారంగా తినడానికి ఈ ఆమ్లెట్ చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే స్పానిష్ ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్పానిష్ ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 5 టేబుల్ స్పూన్స్, బంగాళాదుంపలు – 2 ( మధ్యస్థంగా ఉండేవి), సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కోడిగుడ్లు – 6, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్.
స్పానిష్ ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి వాటిని చాకుతో వీలైనంత పలుచగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో బంగాళాదుంప స్లైసెస్ ను వేసి వేయించాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తరువాత వీటిని నూనె లేకుండా ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత ఇందులోనే ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించిన కళాయిని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి.
ఇందులో ఉండే నూనె వేడయ్యాక సిద్దం చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 8 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత ఆమ్లెట్ విరిగిపోకుండా దీనిని మరో వైపుకు తిప్పుకుని మరో మూడు నిమిషాల పాటు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పానిష్ ఆమ్లెట్ తయారవుతుంది. దీనిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ దోశలు, ఇడ్లీలే కాకుండా అప్పుడప్పుడూ ఇలా కోడిగుడ్లతో స్పానిష్ ఆమ్లెట్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.