Special Chicken Fry : వీకెండ్ వచ్చిందంటే చాలు మన ఇంట్లో చికెన్ తప్పకుండా ఉండాల్సిందే. చికెన్ తినకపోతే అది వీకెండ్ లాగే ఉండదు. చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును తయారు చేస్తూ ఉంటాము. చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్టకుండా ఉండాలంటే దీనిని ఒక్కోసారి ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉండాలి. అందులో భాగంగా చికెన్ ఫ్రైను మరింత రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, పెరుగు – 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, టమాట కిచప్ – 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన పచ్చిమమిర్చి – 3, నిమ్మకాయ – 1.
చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్ని వేసి కలపాలి. తరువాత చికెన్ ను వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి 3 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అంత సమయం లేని వారు కనీసం ఒక గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చికెన్ ను మ్యారినేట్ చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి కలపాలి. దీనిని పెద్ద మంటపై 4 నిమిషాల పాటు వేయించిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి మరో 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మంటను చిన్నగా చేసి చికెన్ ను దగ్గర పడే వరకు బాగా వేయించాలి. చికెన్ చక్కగా వేగిన తరువాత కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై తయారవుతుంది. ఈ విధంగా చేసిన చికెన్ ఫ్రైను ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.