Spicy Mixture Recipe : మనకు స్వీట్ షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో స్పైసీ మిక్చర్ కూడా ఒకటి. ఈ మిక్చర్ కారంగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే బయట కొనే పనిలేకుండా ఈ మిక్చర్ ను అదే రుచితో, అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిక్చర్ ను తయారు చేయడం చాలా సులభం. సాయంత్రం సమయంలో టీ తాగుతూ ఈ మిక్చర్ ను తింటూ ఎంజాయ్ చేయవచ్చు. ఒక్కసారి దీనిని తయారు చేస్తే 20 రోజుల పాటు తాజాగా ఉంటుంది. స్వీట్ షాప్ స్టైల్ స్పైసీ మిక్చర్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – అర కప్పు, పుట్నాల పప్పు – అర కప్పు, కార్న్ ఫ్లేక్స్ – ఒక కప్పు, కరివేపాకు – అర కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, చాట్ మసాలా – ఒక టీ స్పూన్.
బూందీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – 2 టీ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
కారపూస తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 2 కప్పులు, బియ్యంపిండి – 3 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, వాము పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, ఇంగువ – పావు టీ స్పూన్, వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్పైసీ మిక్చర్ తయారీ విధానం..
ముందుగా కారపూస తయారీ కోసం ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యపిండి, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత జంతికల గొట్టాన్ని తీసుకుని అందులో చిన్న రంధ్రాలు ఉన్న బిళ్లను పెట్టి తగినంత పిండిని ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కారపూసను వత్తుకోవాలి. ఈ కారపూసను ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా కారపూసను తయారు చేసుకున్న తరువాత బూందీని తయారు చేసుకోవడానికి గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత బియ్యంపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి గంటె జారుడుగా పిండిని కలుపుకోవాలి.
ఇలా పిండిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక చిల్లుల గంటెలో పిండిని వేసి గంటెను తట్టాలి. ఇలా చేయడం వల్ల బూందీ గుండ్రంగా వస్తుంది. తరువాత ఈ బూందీనిఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇదే నూనెలో పల్లీలు వేసి వేయించి గిన్నెలో వేసుకోవాలి. తరువాత పుట్నాలు, కార్న్ ఫ్లేక్స్, కరివేపాకును కూడా ఒక్కొక్కటిగా వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కారపూసను ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత బూందీ వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ మిక్చర్ తయారవుతుంది. స్నాక్స్ గా తినడానికి ఈ మిక్చర్ చాలా చక్కగా ఉంటుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 20 రోజుల పాటు తాజాగా ఉంటుంది.