Street Style Aloo Parotha : మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద లభించే వివిధ రకాల అల్పాహారాల్లో ఆలూ పరాటాలు కూడా ఒకటి. ఆలూ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇలా మనకు బయట లభించే విధంగా రుచిగా, మెత్తగా ఉండే ఈ ఆలూ పరాటాలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా వీటిని తయారుచేసుకోవచ్చు. వీకెండ్స్ లో ఇలా అప్పుడప్పుడూ ఆలూ పరాటాలను తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ లో రుచిగా ఆలూ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ ఆలూ పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – పావు కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – పావుకిలో, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, వాము – పావు టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – పావు టీ స్పూన్, ఇంగువ – కొద్దిగా.
స్ట్రీట్ స్టైల్ ఆలూ పరాటా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, నూనె, పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. పిండిని చక్కగా కలుపుకున్న తరువాత మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి వాటిని మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఈ ఆలూ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. తరువాత గోధుమపిండిని కూడా ఉండలుగా చేసుకోవాలి.
తరువాత పిండి ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పూరీలాగా వత్తుకోవాలి. తరువాత అందులో ఆలూ ఉండను ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత మరికొద్దిగా పిండి చల్లుకుంటూ పరాటాలా వత్తుకోవాలి. ఈ పరాటాను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత బటర్ లేదా నూనె వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పరాటా తయారవుతుంది. దీనిని రైతా, టమాట చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఆలూ పరాటాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.