Street Style Chicken Pakoda : బండి మీద అమ్మే చికెన్ ప‌కోడాల‌ను ఇంట్లోనే ఇలా 10 నిమిషాల్లో చేసుకోవ‌చ్చు..!

Street Style Chicken Pakoda : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యంలో బ‌య‌ట ల‌భించే వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ల్లో చికెన్ ప‌కోడి ఒక‌టి. చికెన్ ప‌కోడి రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. అచ్చం బండ్ల మీద ల‌భించే విధంగా ఉండే ఈ చికెన్ ప‌కోడిని మ‌నం ఇంట్లో కూడా అదే రుచి వ‌చ్చేలా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే ఈ ప‌కోడిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. స్ట్రీట్ స్టైల్ లో చికెన్ ప‌కోడిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రీట్ స్టైల్ చికెన్ ప‌కోడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్ లెస్ చికెన్ – అర కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, మైదాపిండి – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌పిండి – రెండు టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Street Style Chicken Pakoda recipe in telugu very easy to make and tasty
Street Style Chicken Pakoda

స్ట్రీట్ స్టైల్ చికెన్ ప‌కోడా త‌యరీ విధానం..

ముందుగా చికెన్ లో ఉప్పు వేసి 3 నుండి 4 సార్లు బాగా క‌డ‌గాలి. త‌రువాత దీనిని నీళ్లు లేకుండా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ లేదా 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోస్తూ పిండి ముక్క‌ల‌కు ప‌ట్టేలా బాగా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక త‌గిన‌న్ని చికెన్ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా, క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ ప‌కోడి త‌యార‌వుతుంది. దీనిని నిమ్మ‌ర‌సం, ఉల్లిపాయ ముక్క‌లు, గ్రీన్ చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌టకొనే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే చికెన్ ప‌కోడిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ చికెన్ ప‌కోడిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts