Chicken Soup : చ‌లికాలంలో వేడి వేడి చికెన్ సూప్‌ను తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది.. త‌యారీ ఇలా..

Chicken Soup : మ‌నం వివిధ ర‌కాల సూప్ ల‌ను కూడా త‌యారు చేసుకుని తీసుకుంటూ ఉంటాం. సూప్ ల‌ను కూడా చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం ఆహారంగా తీసుకునే సూప్ ల‌లో చికెన్ సూప్ ఒక‌టి. చికెన్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ఈ చికెన్ సూప్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చికెన్ సూప్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ సూప్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ ముక్క‌లు – 3 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), బ‌ట‌ర్ – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, ప‌చ్చి బ‌ఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన క్యారెట్ ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా తరిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – 2 టేబుల్ స్పూన్స్, క్యాబేజ్ త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ముప్పావు లీట‌ర్, కోడిగుడ్డు తెల్ల‌సొన – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీస్పూన్, ట‌మాట సాస్ – ఒక టీ స్పూన్.

take chicken soup in winter for better health make in this way
Chicken Soup

చికెన్ సూప్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బట‌ర్ క‌రిగిన త‌రువాత వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత చికెన్ ముక్క‌లు వేసి వేయించాలి. దీనిపై మూత‌ను ఉంచి చికెన్ ముక్క‌లు పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌చ్చిబ‌ఠాణీలు, కూర‌గాయ ముక్క‌లు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత చికెన్ ముక్క‌ల‌ను బ‌య‌ట‌కు త‌సి వీలైనంత చిన్న ముక్క‌లుగా చేసుకుని మ‌ళ్లీ సూప్ లో వేసుకోవాలి. త‌రువాత కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను గిన్నెలో వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిని సూప్ లో వేసి ఉడికించాలి. త‌రువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీటిని పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.

త‌రువాత ఈ కార్న్ ఫ్లోర్ మిశ్ర‌మాన్ని సూప్ లో వేసి క‌లుపుకోవాలి. త‌రువాత ఉప్పు, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత వెనిగ‌ర్, సోయాసాస్, గ్రీన్ చిల్లీ సాస్, ట‌మాట సాస్ వేసి క‌ల‌పాలి. సూప్ ను కొద్దిగా చిక్క‌బ‌డే వ‌ర‌కు ఉడికించి కొన్ని స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని గిన్నెలోకి తీసుకుని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే చికెన్ సూప్ త‌యార‌వుతుంది. చ‌లికాలంలో ఇలా చికెన్ సూప్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌లి నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

D

Recent Posts