Tandoori Chicken : మనకు బయట రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో తందూరి చికెన్ కూడా ఒకటి. తందూరి చికెన్ ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బయట లభించే విధంగా ఉండే ఈ తందూరి చికెన్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తందూరి చికెన్ ను తక్కువ నూనెతో, రుచిగా చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తందూరి చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో (ఫుల్ లెగ్ పీసెస్ – 2, డ్రమ్ స్టిక్స్ – 2 ), ఉప్పు – ఒక టీ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, నిమ్మ రసం – అర చెక్క నిమ్మకాయ.
తందూరి మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ముప్పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, తందూరి మసాలా పొడి – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.

తందూరి చికెన్ తయారీ విధానం..
ముందుగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత చికెన్ ముక్కలకు లోతుగా గాట్లు పెట్టుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ ఉప్పు, నిమ్మరసం వేసి చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వస్త్రంలో పెరుగున తీసుకుని దానిలోని నీరు అంతా పోయేలా గట్టిగా వత్తాలి. ఇలా చేయగా మిగిలిన పెరుగును ఒక గిన్నెతోకి తీసుకోవాలి. తరువాత అందులో నూనె యతప్ప మిగిలిన తందూరి మసాలా తయారీకి కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత అందులో చికెన్ ముక్కలను, నూనెను వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఈ గిన్నెను ఒక గంట పాటు డీ ఫ్రిజ్ లో లేదా మూడు గంటల పటు బయట ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి.
తరువాత ఒక కళాయిని తీసుకుని అందులో అందులో చికెన్ ముక్కలను వేసి అటూ ఇటూ తిప్పుతూ 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత అందులో బటర్ వేసి వేయించాలి. బటర్ కరిగిన తరువాత మూత పెట్టి చిన్న మంటపై చికెన్ పూర్తిగా ఉడికే వరకు వేయించాలి. చికెన్ పూర్తిగా వేగిన తరువాత తందూరి చికెన్ కు స్మోకి ప్లేవర్ వచ్చేలా ఒక గిన్నెలో కాలుతున్న బొగ్గును లేదా కాలుతున్న కొబ్బరి చిప్ప ముక్కలను తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను అంచులకు జరిపి మధ్యలో బొగ్గును ఉంచిన గిన్నెను ఉంచాలి. తరువాత ఆ గిన్నెలో ఒక టీ స్పూన్ బటర్, నెయ్యి లేదా నూనెను వేయాలి. ఇలా బటర్ వేయడం వల్ల బొగ్గు నుండి పొగ వస్తుంది.
ఇప్పుడు గాలి బయటకు పోకుండా ఉండేలా మూతను ఉంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని నేరుగా మంటపై ఉంచి 10 సెకన్ల పాటు తిప్పుతూ కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే తందూరి చికెన్ తయారవుతుంది. దీనిని గ్రీన్ చట్నీ, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తక్కువ నూనెతో రుచిగా ఉండే తందూరి చికెన్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ తందూరి చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.