Thotakura Fry : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. తోటకూరను సహజంగానే చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ కొందరు ఫ్రై చేస్తే తింటారు. అయితే మటన్ లివర్ ఫ్రై లాంటి రూపం వచ్చేలా తోటకూరను కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇష్టం లేని వారు కూడా తింటారు. ఈ క్రమంలోనే తోటకూరను వెరైటీగా ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – 3, లేత తోటకూర – 6 కట్టలు, శనగపిండి – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, పసుపు – రెండు చిటికెలు, ఉప్పు – కొద్దిగా, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్.
గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 1/3 కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, టమాటలు – 2, నీళ్లు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గరం మసాలా – రెండు చిటికెలు.
తోటకూర ఫ్రై తయారీ విధానం..
ముందుగా మరుగుతున్న నీటిలో పచ్చిమిర్చి, తోటకూర కాడలతో సహా వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత ఈ తోటకూరను చల్లటి నీటిలో వేసి చల్లారనివ్వాలి. తరువాత దీనిలో ఉండే నీటినంతటిని పిండి జార్ లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో కార్న్ ఫ్లోర్, శనగపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అంచులకు నూనె రాసి అలాగే కింద బటర్ పేపర్ వేసి అందులో తోటకూర మిశ్రమాన్ని ఇంచు మందంతో వేసుకోవాలి. దీనిని కుక్కర్ లో నీళ్లు పోసి అందులో స్టాండ్ ను ఉంచి ఆ స్టాండ్ పై ఈ గిన్నెను ఉంచుకోవాలి.
దీనిని కుక్కర్ విజిల్ పెట్టకుండా మూతను ఉంచి 8 నిమిషాల పాటు పెద్ద మంటపై, 4 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. తరువాత 10 నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి. తరువాత తోటకూర మిశ్రమాన్ని గిన్నె నుండి వేరు చేసుకుని ముక్కలుగా చేసుకోవాలి. దీంతో తోటకూర ముక్కలు అచ్చం మటన్ లివర్ ముక్కల్లా రెడీ అవుతాయి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తోటకూర ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి వేసి వేయించాలి. తరువాత టమాటాలను ఫ్యూరీగా చేసుకుని వేసుకోవాలి. దీనిని కలుపుతూ నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన తోటకూర ముక్కలు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అయితే దీన్ని చూస్తే అందరూ మటన్ లివర్ ఫ్రై అని భ్రమిస్తారు. కానీ తోటకూరను ఇలా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే.. మళ్లీ ఇలాగే చేసుకుంటారు.