Thotakura Pakodi : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తోటకూరతో మనం ఎక్కువగా వేపుడు, పప్పు, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. తోటకూరతో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా తోటకూరతో మనం ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే ఈ తోటకూర పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన తోటకూర – ఒక చిన్న కట్ట, శనగపిండి -ఒక కప్పు, బియ్యం పిండి – పావు కప్పు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 6 లేదా కారానికి తగినన్ని, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు -తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
తోటకూర పకోడి తయారీ విధానం..
ముందుగా గిన్నెలోకి తరిగిన తోటకూరను తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా, మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడీలా వేసుకోవాలి. ఈ పకోడీలను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర పకోడి తయారవుతుంది. వేడి వేడిగా ఈ పకోడీలను తింటే చాలా రుచిగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఇలా పకోడీలను తయారు చేసుకుని తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయవచ్చు.