Thotakura Palli Fry : మనం ఆహారంగా తీసుకునే ఆకు కూరల్లో తోటకూర ఒకటి. తోటకూరను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయి. ఇది మనకు మార్కెట్ లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తోటకూరను తరచూ తినడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. బీపీని నియంత్రించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, రక్త హీనతను తగ్గించడంలో తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటకూరతో ఫ్రై లను, కూరలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. తోటకూరతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే తోటకూర ఫ్రై కి బదులుగా పల్లీల పొడిని వేసి చేసే తోటకూర ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. పల్లీల పొడిని వేసి తోటకూర ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన తోటకూర – ఒక కట్ట (పెద్దది), వేయించి పొట్టు తీసిన పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, పుట్నాల పప్పు – 2 టీ స్పూన్స్, ఎండు మిర్చి – 5 లేదా 6, వెల్లుల్లి రెబ్బలు – 5, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 1, కరివేపాకు – ఒక రెబ్బ, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
తోటకూర ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పల్లీలు, పుట్నాలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా ఉండే విధంగా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, ఆవాలు, శనగ పప్పు, మినప పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును, పసుపును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత శుభ్రంగా కడిగిన తోటకూరను వేసి కలుపుతూ వేయించుకోవాలి. తోటకూర పూర్తిగా వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా తోటకూర వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.