Thotakura Podikura : తోటకూర.. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో ఇది ఒకటి. తోటకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. తోటకూరతో చేసుకోదగిన రుచికరమైన కూరలల్లో తోటకూర పొడికూర కూడా ఒకటి. తోటకూరతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఈ పొడికూరను సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా తోటకూర పొడికూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర పొడి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – పావు కప్పు, ఎండుమిర్చి – 10, జీలకర్ర – ఒక టీ స్పూన్, పుట్నాల పప్పు – 3 టీ స్పూన్స్, తోటకూర – 7 కట్టలు ( చిన్నవి), నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత.
తోటకూర పొడి కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి కలుపుతూ వేయించాలి. పల్లీలు వేగిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఎండుమిర్చి చల్లారిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పల్లీలు, పుట్నాల పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి వేయించాలి. తరువాత శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలపై మూత పెట్టి మెత్తబడే వరకు వేయించిన తరువాత తరిగిన తోటకూర, ఉప్పు వేసి కలపాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మూత తీసి కూరలోని నీరంతా పోయి తోటకూర పొడి పొడిగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తోటకూర పొడి కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తోటకూర అంటే ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా చేసిన వేపుడును ఇష్టంగా తింటారు.