Tomato Egg Omelette : కోడిగుడ్లతో కూరలే కాకుండా మనం ఆమ్లెట్ ను కూడా వేస్తూ ఉంటాము. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఆమ్లెట్ ను కూడా మనం వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటాము. తరుచూ ఒకేరకం ఆమ్లెట్ కాకుండా కింద చెప్పిన విధంగా తయారు చేసే టమాట ఆమ్లెట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినవచ్చు. అలాగే నేరుగా అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ఈ టమాట ఆమ్లెట్ ను తయారు చేయడం చాలా సులభం. వెరైటీ రుచులను కోరుకునే వారు ఇలా వెరైటీగా టమాట ఆమ్లెట్ ను వేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాట ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, అల్లం తురుము – అర టీ స్పూన్స్, తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 2, చిన్నగా తరిగిన పుదీనా ఆకులు – 5, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కోడిగుడ్లు – 3, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, బటర్ లేదా నూనె – 2 టేబుల్ స్పూన్స్.
టమాట ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా టమాటాలను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకుని బాగా కలపాలి. తరువాత బటర్ తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత బటర్ లేదా నూనె వేసి వేడి చేయాలి. తరువాత టమాట ముక్కలను పెనం మీద వేసి చిన్న మంటపై ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత ఈ ముక్కలను మరో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు వేయించాలి. తరువాత ఈ ముక్కలపైకొద్దిగా మిరియాల పొడి, ఉప్పు చల్లుకోవాలి. తరువాత ఈ ముక్కలను దగ్గరగా అని వాటి పైనుండి ముందుగా తయారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఆమ్లెట్ ఒకవైపు చక్కగా వేగే వరకు వేయించాలి. తరువాత మూత తీసి మరో వైపుకు తిప్పి మరో అర నిమిషం పాటు వేయించి ఆమ్లెట్ ను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట ఆమ్లెట్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన టమాట ఆమ్లెట్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.