Tomato Masala Oats : ఓట్స్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, షుగర్ ను నియంత్రించడంలో, మలబద్దకం సమస్యను తగ్గించడంలో, చర్మ సమస్యలను నయం చేయడంలో ఓట్స్ మనకు ఎంతో సహాయపడతాయి. అలాగే పొట్టలో మంచి బ్యాక్టీరియాలను పెంచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి మనకు ఉపయోగపడతాయి. ఈ ఓట్స్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా, చాలా సులభంగా చేసుకోగలిగే టమాట మసాలా ఓట్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మసాలా ఓట్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – 110 గ్రా., నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 200 గ్రాములు, నీళ్లు – పావు లీటర్, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
టమాట మసాలా ఓట్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత కారం, నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు చక్కగా మరిగిన తరువాత ఓట్స్ ను వేసి ఉండలు లేకుండా కలపాలి. దీనిని దగ్గర పడే వరకు చిన్న మంటపై ఉడికించాలి. ఓట్స్ ఉడికి దగ్గర పడిన తరువాత గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి.
కొద్దిగా నీరు ఉండగానే కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మసాలా ఓట్స్ తయారవుతుంది. దీనిని అల్పాహారంగా, స్నాక్స్ గా ఎలా అయినా తినవచ్చు. ఈ విధంగా టమాట మసాలా ఓట్స్ ను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. దీనిని ఇంకా కావాలని అడిగి మరీ ఇష్టంగా విడిచిపెట్టకుండా తింటారు.