Tomato Miriyala Rasam : మనం టమాటాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలతో చేసే రుచికరమైన వంటకాల్లో టమాట రసం కూడా ఒకటి. టమాట రసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ రసాన్ని మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మిరియాలు వేసి చేసే ఈ టమాట మిరియాల రసం మరింత రుచిగా ఉంటుంది. అలాగే ఈ రసాన్ని తీసుకోవడం వల్ల మనం జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే టమాట మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట మిరియాల రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – పెద్దవి నాలుగు, చింతపండు – చిన్న నిమ్మకాయంత, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – అర కప్పు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 1.
రసం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, మెంతులు – పావు టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ఎండు కొబ్బరి ముక్కలు – 2 ( చిన్నవి), వెల్లుల్లి రెబ్బలు – 4.
టమాట మిరియాల రసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో వెల్లుల్లి రెబ్బలు తప్ప మిగిలిన రసం పొడికి కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో టమాట ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టి ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి టమాట ముక్కలను పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి. టమాట ముక్కలను మెత్తగా చేసుకున్న తరువాత ఒక లీటర్ నీళ్లు, మిక్సీ పట్టుకున్న రసం పొడి వేసి కలపాలి.
తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా టమాట రసాన్ని వేసి కలపాలి. తరువాత ఈ రసాన్ని 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట మిరియాల రసం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన టమాట మిరియాల రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.