Nimmakaya Rasam : మనం వంటింట్లో నిమ్మకాయలను విరివిరిగా వాడుతూ ఉంటాము. నిమ్మకాయలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నిమ్మకాయను వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అలాగే వంటల్లో నిమ్మకాయను వాడడం వల్ల వంటలు మరింత రుచిగా తయారవుతాయి. అలాగే ఈ నిమ్మకాయతో మనం ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ రసం చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇలా నోటికి రుచిగా ఉండేలా వేడి వేడిగా నిమ్మకాయ రసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ రసాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ నిమ్మకాయ రసాన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పచ్చిమిర్చి – 4, సన్నగా తరిగిన టమాట – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉడికించి మెత్తగా చేసిన కందిపప్పు – పావు కప్పు, ఉప్పు – తగినంత, బెల్లం – ఒక చిన్న ముక్క, నీళ్లు – 800 ఎమ్ ఎల్, పసుపు – పావు టీ స్పూన్, అల్లం – అర ఇంచు ముక్క, మిరియాలు – అర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె- ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, ఇంగువ – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
నిమ్మకాయ రసం తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పచ్చిమిర్చి, టమాట ముక్కలు, కొత్తిమీర, కందిపప్పు, ఉప్పు, బెల్లం, నీళ్లు, పసుపు వేసి కలపాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి రసాన్ని మరిగించాలి. రసం చక్కగా మరిగి ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత అల్లాన్ని, మిరియాలను కచ్చా పచ్చాగా దంచి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన అల్లం మరియు మిరియాలు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని రసంలో వేసి కలపాలి. తరువాత ఈ రసం గిన్నెను మరలా స్టవ్ మీద ఉంచి మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ రసం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన రసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.