Tomato Pachadi : టమాటాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. టమాటాల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ టమాటాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. టమాటాలతో కూరలనే కాకుండా పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో అప్పటికప్పుడు రుచిగా చాలా తక్కువ సమయంలో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – పావు కిలో, పచ్చిమిర్చి – 10లేదా తగినన్ని, చింతపండు – 5 గ్రా., జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు, చింతపండు, పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత మూత తీసి వాటిలో ఉండే నీరు అంతా ఇంకిపోయేలా వేయించాలి. టమాట ముక్కలు దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. టమాట ముక్కలు చల్లారిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.
ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వంట చేయడానికి సమయం లేనప్పుడు ఇలా టమాటాలతో పచ్చడిని తయారు చేసుకుని తినవచ్చు. కేవలం అన్నంతోనే కాకుండా దోశ, ఊతప్పం వంటి వాటితో కూడా ఈ పచ్చడిని కలిపి తినవచ్చు.