Tomato Pulusu : టమాట పులుసు.. టమాటాలతో చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా టమాట పులుసును తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ పులుసును తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే టమాట పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 4( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – చిటికెడు, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నీళ్లు – తగినన్ని, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట పులుసు తయారీ విధానం..
ముందుగా టమాటాలను తురుముకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు వేసి కలపాలి. కరివేపాకు వేగిన తరువాత టమాట గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు రసం వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూనూనె పైకి తేలే ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన టమాట పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.