Tomato Sambar : మనం వంటింట్లో టమాటాలను విరివిగా వాడుతూ ఉంటాము. టమాటాలతో ఎంతో రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కూరలు, పచ్చళ్లు, చట్నీలు, చారు ఇలా ఎన్నో రకాల వంటకాలను టమాటాలతో తయారు చేస్తూ ఉంటాము. తరుచూ చేసే వంటకాలతో పాటు టమాటాలతో ఎంతో రుచికరమైన సాంబార్ ను కూడా తయారు చేసుకోవచ్చు. టమాటాలతో చేసే ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో ఈ సాంబార్ ను వేసుకుని వెజ్ , నాన్ వెజ్ ఫ్రై వంటకాలను సైడ్ డిష్ గా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాట సాంబార్ ను చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ టమాట సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 3, తరిగిన టమాటాలు – 4, తరిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, చింతపండు – చిన్ననిమ్మకాయంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఇంగువ – చిటికెడు.
టమాట సాంబార్ తయారీ విధానం..
ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్ లో తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నింటిని వేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న సాంబార్ వేసి కలపాలి. తరువాత ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఈ సాంబార్ ను మరో 4 నిమిషాల పాటు మరిగించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట సాంబార్ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను అందరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు.