Shane Warne : ప్రముఖ ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మృతి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆయన ఇప్పటి వరకు అనుమాస్పద స్థితిలోనే మృతి చెందారని భావించారు. కానీ ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడం వల్లే చనిపోయాడని పోలీసులు దాదాపుగా నిర్దారించారు. అయితే షేన్ వార్న్‌ను చివరిసారిగా ఇద్దరు థాయ్ మహిళలు చూశారు. వారు ఆయనకు మసాజ్ కూడా చేశారు. తరువాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆ మహిళలు ఎవరు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మొత్తం నలుగురు మహిళలు కో సముయ్ లోని సముజానా విల్లాకు వచ్చారు. అక్కడ వార్న తన స్నేహితులతో బస చేశాడు. అయితే ఆ నలుగురిలో ఇద్దరు మహిళలు వార్న్ వద్దకు వెళ్లి మసాజ్ చేయగా.. మరో ఇద్దరు ఆయన స్నేహితుల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.58 గంటల సమయంలో ఆ నలుగురు మహిళలు ఆ విల్లా నుంచి వెళ్లిపోయారు. వారు విల్లాకు వచ్చి పోయే దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లోనూ రికార్డయ్యాయి.
అయితే వార్న్ చనిపోవడానికి, ఆ మహిళలకు ఎలాంటి సంబంధం లేదని.. ఆయన మసాజ్ వల్ల చనిపోలేదని.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడం వల్లే చనిపోయాడని పోలీసులు తెలిపారు. గదిలో ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని.. చిందరవందరగా వస్తువులు పడి ఉన్న జాడ కూడా లేదని తెలిపారు. అయితే వార్న్ మృతికి, ఆ మహిళలకు సంబంధం లేకపోయినా.. ఆ మహిళల కోసం ఆరా తీస్తున్నామని, వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు. వారు వెళ్లిపోయాక కొంత సేపటికి వార్న్ స్నేహితులు అతని గది వద్దకు రాగా అప్పుడు గది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వారు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా.. వార్న్ రక్తపు వాంతులు చేసుకుని పడి ఉన్నాడు.
అయితే అతని స్నేహితులు ఆంబులెన్స్ వచ్చేలోగా సీపీఆర్ చేశారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వార్న్‌ది హార్ట్ ఎటాక్ వల్ల సంభవించిన మరణమే అని పోలీసులు దాదాపుగా ధ్రువీకరించేశారు. దీంతో అనుమానాలు అన్నీ తీరినట్లే అని తెలుస్తోంది.