Ulava Charu : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిల్లో ఉలవలు కూడా ఒకటి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో, జుట్టు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉలవలు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిని ఉడికించి తీసుకోవడంతో పాటు ఉలవలతో మనం ఎంతో రుచిగా ఉండే చారును కూడా తయారు చేసుకోవచ్చు. ఉలవచారు చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడేలా ఉలవలతో చారును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉలవచారు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉలవలు – 300 గ్రా., తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, నానబెట్టిన చింతపండు – 30 గ్రా., దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, బెల్లం – చిన్న ముక్క, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – రెండు చిటికెలు, కరివేపాకు – ఒక రెమ్మ.
ఉలవచారు తయారీ విధానం..
ముందుగా ఉలవలను శుభ్రంగా కడగాలి. తరువాత ఒక లీటర్ నీటిని పోసి ఈ ఉలవలను 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ ఉలవలను నీటితో సహా కుక్కర్ లో వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక గంట పాటు ఉడికించాలి. తరువాత ఉలవలను వడకట్టి ఆ నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేయాలి. అందులో ఉల్లిపాయలు, టమాట ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, చింతపండు రసం వేసి కలిపి మరిగించాలి. తరువాత ఒక జార్ లో ఉడికించిన ఉలవల నుండి సగం ఉలవలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఉలవలను మరుగుతున్న చారులో వేసి కలపాలి. తరువాత బెల్లం వేసి కలిపి అరగంట పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న చారులో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉలవచారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఉలవలతో చారును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ ఉలవచారును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.