Ulava Karam Podi : పూర్వ కాలంలో అధికంగా తీసుకునే ఆహార పదార్థాలలో ఉలవలు ఒకటి. ఉలవలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని ఆహారంగా తీసుకునే వారు చాలా తక్కువగా ఉన్నారు. అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణాశయ సంబంధమైన సమస్యలను తగ్గించడంలోనూ ఉలవలు ఎంతో సహాయపడతాయి. ఉలవలను తరుచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పురుషులల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
ఎదిగే పిల్లలకు ఉలవలను వారంలో రెండు సార్లు ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఉలవలతో చారు, గుగ్గిళ్లను తయారు చేయడమే కాకుండా కారం పొడిగా చేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. ఉలవలతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉలవల కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉలవలు – అర కప్పు, ధనియాలు – 3 టేబుల్ స్పూన్స్, కంది పప్పు- 2 టేబుల్ స్పూన్స్, మినప పప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు మిరపకాయలు – 15 నుండి 20, వెల్లుల్లి ఉల్లిపాయ – ఒకటి, మెంతులు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత.
ఉలవల కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఉలవలను వేసి రంగు మారే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి ధనియాలు, మినప పప్పు, కందిపప్పును వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మెంతులు, జీలకర్ర, ఎండు మిరపకాయలను వేసి వేయించి చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో ముందుగా వేయించిన ఉలవలను వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత వేయించిన ఎండు మిరపకాయల మిశ్రమాన్ని, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పును వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉలవల కారం పొడి తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఈ కారం పొడిని అన్నంతో పాటు లేదా దోశ, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అన్నంలో నెయ్యితోపాటు ఈ కారం పొడిని కలిపి తింటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.