Ullikaram Chicken Roast : మనం చికెన్ తో వేపుడును కూడా తయారు చేస్తూ ఉంటాము. చికెన్ వేపుడు ఎలా చేసిన కూడా చాలా రుచిగా ఉంటుంది. స్టాటర్ గా తినడానికి సైడ్ డిష్ గా తినడానికి చికెన్ వేపుడు చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది చికెన్ వేపుడును ఇష్టంగా తింటారు. తరచూ ఒకే స్టైల్ లో కాకుండా కింద చెప్పిన విధంగా మరింత రుచిగా కూడా చికెన్ వేపుడును మనం తయారు చేసుకోవచ్చు. ఉల్లికారం వేసి చేసే ఈ చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లికారం చికెన్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లికారం చికెన్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 5 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, ఉల్లిపాయలు – 3, కారం – ఒకటిన్నర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క – రెండు ఇంచులముక్క, లవంగాలు – 6, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 2, స్టోన్ ప్లవర్ – కొద్దిగా, మిరియాలు – అర టీ స్పూన్, జాపత్రి – కొద్దిగా, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్.
ఉల్లికారం చికెన్ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత అందులో ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తరువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కారం వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత చికెన్, ఉప్పు, పసుపు వేసి కలపాలి. చికెన్ ను మూత పెట్టి 15 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత మూత తీసి చికెన్ ను పూర్తిగా వేయించాలి. చికెన్ వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత అందులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. దీనిని 4 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి, మరికొద్దిగా కరివేపాకు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లికారం చికెన్ వేపుడు తయారవుతుంది. దీనిని నేరుగా లేదా సైడ్ డిష్ గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.