Ullikaram Kodiguddu Vepudu : మనం ఉడికించిన కోడిగుడ్లతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. ఉడికించిన కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు కూడా ఒకటి. ఉల్లికారం వేసి చేసే ఈ కోడిగుడ్డు వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా వేపుడును తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లికారం కోడిగుడ్డు వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు – 3, వెల్లుల్లి రెబ్బలు – 8, కారం – 3 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ఉడికించిన కోడిగుడ్లు – 3,తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు తయారీ విధానం..
ముందుగా జార్ లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై ఒక నిమిషం పాటు వేయించిన తరువాత కోడిగుడ్లను ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటిని అంతా కలిసేలా కలుపుకుని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఉల్లికారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.