Upma Rava Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇడ్లీలను తయారు చేయడానికి మనం ఇడ్లీ రవ్వను ఉపయోగిస్తాము. ఇడ్లీ రవ్వతో కాకుండా మనం ఉప్మా చేసే సూజీ రవ్వతో కూడా ఈ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతో చేసే ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా, చాలా రుచిగా ఉంటాయి. ఉన్మా రవ్వతో ఇడ్లీలను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సూజీ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉప్మా రవ్వ – ఒక గ్లాస్, చిక్కటి మజ్జిగ – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – అర గ్లాస్, వంటసోడా – అర టీ స్పూన్.
సూజీ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉప్మా రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో చిక్కటి మజ్జిగను కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి అర గంట నుండి గంట పాటు రవ్వను నానబెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కందిపప్పు వేసి వేయించాలి. తరువాత తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వపై మూత తీసి అందులో వంటసోడా, నీళ్లు పోసి కలపాలి. తరువాత తాళింపును వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఇడ్లీ ప్లేట్ లల్లో రవ్వ మివ్రమాన్ని వేసి కుక్కర్ లో ఉంచాలి.
ఈ ఇడ్లీలను మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇడ్లీలను బయటకు తీసి కొద్దిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. తరువాత ఇడ్లీలను ప్లేట్ నుండి వేరు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సూజీ ఇడ్లీలు తయారవుతాయి. వీటిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. సమయం తక్కువగా ఉన్నప్పుడు, ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే సూజీ ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. ఉప్మాను తినని వారు కూడా ఉప్మా రవ్వతో చేసిన ఈ ఇడ్లీలను ఇష్టంగా తింటారు.