Beauty Tips : చర్మం అందంగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.కానీ మనలో చాలా మంది వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, రసాయనాలు కలిగిన లోషన్ లను, ఫేస్ వాష్ లను, క్రీములను వాడడం వంటి రకరకాల కారణాల చేత చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన చర్మానికి ముఖ్యంగా ఏడు రకాల పోషకాలు అవసరం. చర్మానికి అవసరమయ్యే ఏడు రకాల పోషకాల్లో మొదటిది విటమిన్ ఎ. సూర్యుడు నుండి వచ్చే యువీ కిరణాల నుండి చర్మాన్ని కాపాడడంలో, అలాగే వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల నుండి చర్మాన్ని సంరక్షించడంలో విటమిన్ ఎ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
విటమిన్ ఎ ఎక్కువగా ఆకుకూరల్లో ఉంటుంది. కనుక వీలైనంత ఎక్కువగా వీటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. అదే విధంగా విటమిన్ సి కూడా మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మం లోపలి పొరల్లో ఉండే కొలాజెన్ ఎక్కువగా తయారవ్వడానికి అలాగే కొలాజెన్ ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ సి ఎంతో అవసరం. అలాగే చర్మ కణాల్లో తయారయ్యే ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో కూడా విటమిన్ సి దోహదపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే జామ కాయలు, ఉసిరికాయలు, పుల్లటి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే చర్మ కణాల పై ఉండే కవచనాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ ఇ మనకు సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ ఇ లభించి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మన చర్మానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ డి మరొకటి. చర్మ కణాల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది మనకు ఎంతగానో సహాయపడుతుంది. రోజులో ఒక గంట పాటు చర్మానికి ఎండ తగిలేలా చేయడం వల్ల తగినంత విటమిన్ డి లభించి చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మ కణాలను మరమత్తు చేయడంలో, చనిపోయిన చర్మ కణాల స్థానంలో మరొకటి త్వరగా వచ్చేలా చేయడంలో జింక్ మనకు సహాయపడుతుంది. గుమ్మడిగింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను తరచూ తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అదే విధంగా చర్మానికి అవసరమయ్యే మరో పోషకం సెలెనియం. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది చర్మ కణాల్లో ఉండే డి ఎన్ ఎ దెబ్బతినకుండా చేయడంలో సహాయపడుతుంది. దీంతో చనిపోయిన చర్మ కణాల స్థానంలో అలాంటి చర్మ కణమే మరలా తయారవుతుంది.
ఇది కూడా ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక చర్మానికి అవసరమయ్యే పోషకాల్లో చివరిది ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్. ఇది చర్మాన్ని డీ హైడ్రేషన్ కు గురి కాకుండా చేయడంలో, చర్మ కణాల్లో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో దోహదపడుతుంది. అవిసె గింజల్లో, వాల్ నట్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడు రకాల పోషకాలను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా, ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ మధ్యాహ్నం ఆకుకూరలను తీసుకోవడం, పండ్లరసాన్ని తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టుకుని ఆహారంలో భాగంగా తీసుకోవడం, నీటిని ఎక్కువగా తాగడం వంటివి చేయడం వల్ల చర్మం ఆరోగ్యం ఉంటుంది. చర్మం ముడతలు పడకుండా ఉండడంతో పాటు చర్మం అందంగా, కాంతివంతంగా ఉంటుంది.