Vankaya Tomato Pachadi : మనం వంకాయలతో కూరలు, వేపుడే కాకుండా ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వంకాయ పచ్చడిని ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకంగా కాకుండా టమాటాలు వేసి ఈ పచ్చడిని మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో వంకాయలు, టమాటాలు ఉంటే చాలు ఈ పచ్చడిని చాలా సులభంగా, చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. కూరలు లేకపోయినప్పటికి ఈ పచ్చడితోనే కడుపు నిండా భోజనం చేయవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ వంకాయ టమాట పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – 3, తరిగిన టమాటాలు – 3, నూనె – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు -చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు – 7, చింతపండు – ఒక రెమ్మ, పచ్చిమిర్చి – 10, కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
వంకాయ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను పూర్తిగా మగ్గించాలి. వంకాయ ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి.తరువాత అదే కళాయిలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.
టమాట ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వంకాయ ముక్కలు వేసి పల్స్ ఇస్తూ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపును తయారు చేసి పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసిన ఈ వంకాయ పచ్చడిని ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.