Vegetable Egg Dosa : మనం అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. దోశలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన అభిరుచికి తగినట్టు రకరకాల దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కింద చెప్పిన విధంగా వెజిటేబుల్స్, కోడిగుడ్డు కలిపి చేసే ఈ దోశ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఒక్కసారి ఈ దోశను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ వెజిటేబుల్ దోశను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేబుల్ ఎగ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
దోశ పిండి – తగినంత, కోడిగుడ్లు – 2, క్యారెట్ తురుము – అర కప్పు, చిన్నగా తరిగిన బీన్స్ – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1,చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, టమాట సాస్ – కొద్దిగా, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్.
వెజిటేబుల్ ఎగ్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో టమాట సాస్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, ఒక టీ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్డును తీసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న టమాట కిచప్ ను వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ క్యారెట్ తురుము, ఒక టీ స్పూన్ బీన్స్ ముక్కలు, ఒక టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి బాగా వేడి చేయాలి. పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి.
దోశ తడి ఆరిపోయిన తరువాత ముందుగా తయారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకుని దోశంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిపై నూనె వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. దోశ ఒకవైపు చక్కగా కాలిన తరువాత మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. ఇలా దోశను రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ ఎగ్ దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన వెజిటేబుల్ ఎగ్ దోశను తినడం వల్ల రుచితో పాటు మనం ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.