Vegetable Pongal : మనం ఉదయం పూట అల్పాహారంగా తీసుకునే వాటిలో పొంగల్ కూడా ఒకటి. పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. అలాగే దీనిని మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన పొంగల్ వెరైటీలలో వెజిటేబుల్ పొంగల్ కూడా ఒకటి. ఈ పొంగల్ ను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఈ వెజిటేబుల్ పొంగల్ ను ఆహారంగా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పొంగల్ చక్కటి ఆహారమని చెప్పవచ్చు. దీనిని కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మన దృష్టి ఇతర చిరుతిళ్ల పైకి వెళ్లకుండా ఉంటుంది. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ వెజిటేబుల్ పొంగల్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేబుల్ పొంగల్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, ఎర్ర కందిపప్పు – అర కప్పు, పెసరపప్పు – పావు కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన క్యారెట్స్ – 2, తరిగిన బీన్స్ – 5, తరిగిన టమాటాలు – 2, తరిగిన మునక్కాయలు – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక స్పూన్, ఉప్పు – తగినంత.
వెజిటేబుల్ పొంగల్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పప్పులను,బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత అల్లం తరుగు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కూరగాయల ముక్కలు వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా పసుపును కూడా వేసుకోవచ్చు. తరువాత నానబెట్టిన బియ్యం, పప్పులు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత 4 కప్పుల నీళ్లు పోసి కలపాలి.
చివరగా మరో టీ స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరి పోయిన తరువాత అంతా కలిసేలా మరోసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పొంగల్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా చట్నీ, సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పొంగల్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఈ పొంగల్ లో ఇతర కూరగాయలను కూడా వేసుకోవచ్చు.