Vegetable Roastie : మనం ఉదయం పూట రకరకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన వివిధ రకాల అల్పాహారాల్లో వెజిటేబుల్ రోస్టీ కూడా ఒకటి. ఈ వెజిటేబుల్ రోస్టీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం పూట అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా వెజిటేబుల్ రోస్టీని తయారు చేసుకుని తినవచ్చు. తేలికగా, రుచిగా చేసుకోగలిగే ఈ వెజిటేబుల్ రోస్టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజిటేబుల్ రోస్టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒకటిన్నర కప్పు, పుల్లటి పెరుగు – అర కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 2, క్యారెట్ తురుము – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన క్యాప్సికం – 1, అల్లం తరుగు – ఒక టీస్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వంటసోడా – అర టీ స్పూన్.
వెజిటేబుల్ రోస్టీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్నీ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ బియ్యాన్ని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పెరుగు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను కూడా ఒక్కొక్కటిగా వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో లేదా పెనం మీద నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఒక గంటె పిండిని తీసుకుని ఊతప్పంలా వేసుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ రోస్టీ తయారవుతుంది. దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో పుల్లటి పెరుగుకు బదులుగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. తరచూ చేసే అల్పాహారాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా వెజిటేబుల్ రోస్టీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.