Jayaprada : అందానికి అసలైన చిరునామా ఆమె. భూమికోసం చిత్రంతో తెలుగు తెరపై తలుక్కుమని మెరిసిన తార. సాంఘిక చిత్రాలలోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు జయప్రద. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూనే పలు సినిమాల్లో నటించారు. ఆమె ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ తో ఆమెకు ఉన్నటువంటి అనుబంధం గురించి ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు జయప్రద.
చిన్నప్పటినుండి ఆయన్ను చూస్తూ పెరిగాను. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాక ఎన్టీఆర్ నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పుకుంటూనే ఎన్టీఆర్ గారు నాకు రోల్ మోడల్ అని జయప్రద వెల్లడించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఫోన్ చేసి పార్టీలో చేరమని చెబితే ఆలోచించకుండా టిడిపి పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాను. కానీ ఎలాంటి పదవులను కూడా ఆశించలేదని, కేవలం ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది నా ప్రధాన లక్ష్యమని జయప్రద తెలియజేశారు.
నేను రాజకీయాల్లో ఉన్న సమయంలోనే చంద్రబాబు టిడిపిని చేతిలోకి తీసుకున్న వెంటనే ఎన్టీఆర్ ను వదిలి ఎంతో మంది ఎమ్మెల్యేలు బలవంతం మీదనే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబును సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే నేను కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను. ఇదే నా జీవితం లో మొదటి సారిగా నేను చేసిన అతి పెద్ద పొరపాటు.
ఎన్టీఆర్ నన్ను నమ్మి పార్టీలోకి ఆహ్వానిస్తే, ఆయన దగ్గర ఉండాల్సిన నేను తప్పుడు నిర్ణయం తీసుకొని బయటకు వచ్చాను అని జయప్రద తెలియజేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా పదవిలో కొనసాగానని, ఆ తర్వాత పార్టీలో అనేక మార్పులు చేర్పుల వల్ల నాకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని, దీంతో పార్టీ వదిలివేసి బయటకు వెళ్లాల్సి వచ్చిందని జయప్రద ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.