Wheat Dosa : మనలో చాలామంది దోశలను ఇష్టంగా తింటారు. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే పిండి రుబ్బి పనే లేకుండా, పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు కూడా ఎంతో రుచికరమైన దోశలను తయారు చేసుకోవచ్చు. ఈ దోశలను సులభంగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఇన్ స్టాంట్ గా దోశలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒకటిన్నర కప్పు, పంచదార – ఒక టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – కొద్దిగా.
గోధుమపిండి దోశ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పంచదార, వంటసోడా వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానిపై నూనె వేసి ఉల్లిపాయతో రుద్దాలి. ఇప్పుడు పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. తరువాత దీనిపై నూనెను వేసుకోవాలి. ఈ దోశను రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉదయంపూట ఏం చేయాలో తోచనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు గోధుమపిండి దోశను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.