Wheat Flour Breakfast : రోజూ ఒకే రకమైన టిఫిన్స్ ను తిని విసుగెత్తిపోయారా.. కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా.. అలాంటి వారు కింద చెప్పిన విధంగా రుచిగా, ఇన్ స్టాంట్ చక్కటి అల్పాహారాన్ని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా తేలికగా తయారు చేసుకోవచ్చు. టిపిన్ ఏం చేయాలో తోచనప్పుడు కూడా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ ఇన్ స్టాంట్ బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ బ్రేక్ ఫాస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కరివేపాకు -ఒక రెమ్మ, మిరియాల పొడి – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, రెడ్ చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఇన్ స్టాంట్ బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి.తరువాత మిగిలిన పదార్థాలను వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. దీనిని ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలుపుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత పిండిని తీసుకుని మరీ మందంగా కాకుండా దోశ లాగా వేసుకోవాలి. ఈ దోశ సాధారణ దోశ వలె పలుచగా రాదు. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. ఒక వైపు ఎర్రగా కాలిన తరువాత దోశను మరో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి.
ఇలా రెండు వైపులా దోశను చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోధుమపిండి దోశ తయారవుతుంది.దీనిని పుల్లటి చట్నీలతో లేదా ఆవకాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారు కూడా ఇలా అప్పటికప్పుడు గోధుమపిండితో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా చక్కటి దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.