Wheat Flour Paratha : పరోటాలు.. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ వంటకాలతో పాటు మసాలా కూరలతో తింటే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాధారణంగా పరాటాలను మనం మైదాపిండితో తయారు చేస్తూ ఉంటాము. అయితే మైదాపిండి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కనుక మైదాపిండికి బదులుగా గోధుమపిండితో ఈ పరోటాలను తయారు చేసుకోవడం మంచిది. గోధుమపిండితో కూడా మనం రుచిగా, పొరలు పొరలుగా వచ్చే పరోటాలను తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. గోధుమపిండితో రుచికరమైన పరోటాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, వేడి నూనె – 2 టేబుల్ స్పూన్స్.
గోధుమపిండి పరాటా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత రవ్వ, ఉప్పు వేసి కలపాలి. తరువాత నూనె వేసి కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. తరువాత చేత్తో నొక్కుతూ పిండిని బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై నూనె రాసి మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని సమానమైన ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని వీలైనంత పలుచగా వత్తుకోవాలి. తరువాత దీనిపై నూనె లేదా నెయ్యిని రాసుకోవాలి. తరువాత కార్న్ ఫ్లోర్ ను చల్లుకోవాలి. తరువాత చాకుతో ఈ చపాతీని నిలువుగా సన్నటి ముక్కల వలె కట్ చేసుకోవాలి. తరువాత చాకుతో నెమ్మదిగా ఈ ముక్కలను ఒక్కదాని మీదకి ఒకటి అంటూ దగ్గరికి వచ్చేలా చుట్టుకోవాలి.
తరువాత దీనిని రోల్ లాగా చేసుకుని నెమ్మదిగా పరాటాలా వత్తుకోవాలి. తరువాత ఈ పరాటాను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఒక దాని మీద మరొక పరోటాను వేసి పొరలు పొరలుగా విడిపోయేలా చేత్తో వత్తుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి పరోటాలు తయారవుతాయి. వీటిని ఏ మసాలా కూరతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇలా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా గోధుమపిండితో కూడా రుచికరమైన పరోటాలను తయారు చేసి తీసుకోవచ్చు.