సాధారణంగా మనం దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు మన తలపై శఠగోపం పెట్టడం చూస్తుంటాము. అయితే శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటి? ఎందుకు భక్తుల తలపై మాత్రమే శఠగోపం పెడతారు అనే విషయం బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఆలయానికి వెళ్ళిన భక్తులకు శఠగోపం పెట్టడానికి గల కారణం ఏమిటో, దాని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి స్వామివారి పాదాలను నమస్కరించే అవకాశం ఉండదు కనుక పూజారి స్వామివారి పాదాల చెంత ఉన్న శఠగోపం తీసుకోవచ్చి భక్తుల తలపై పెడతారు. ఈ విధంగా పూజారి శఠగోపం మన తలపై ఉంచినప్పుడు భక్తులు తమ మనసులో ఉన్న కోరికను కోరుకోవడం వల్ల ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
శఠగోపం మన తలపై పెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశించిపోతాయి.ఈ శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శడగోప్యం అని అంటారు. సైన్స్ ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బయటకెళుతుంది. తద్వారా మనలో ఉన్నటువంటి ఆందోళన అలజడి కూడా తగ్గిపోతాయి. అందుకే ఆలయంలోకి వెళ్ళిన భక్తుడు ఎంతో మానసిక ప్రశాంతతను కలిగి ఉంటాడు.