ప్రపంచ వ్యాప్తంగా మల్బెర్రీలను తినే వారి సంఖ్య అధికమే. మన వాడుక భాషలో బొంత పండ్లుగా పిలుచుకునే మల్బెర్రీలు మనకు గ్రామాలలో కనిపిస్తాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచి కలిగి ఉన్న మల్బెర్రీలకు చాలా ఔషధ గుణాలున్నాయి. ‘మారుస్ ఆల్బా’ వృక్షానికి కాచే ఈ పండ్లు, ఈ వృక్షం కూడా అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉంటాయి. రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో ఏర్పడే అడ్డంకులను తగ్గించడంలో మల్బెర్రీ ఆకుల రసం తోడ్పడుతుంది. వయసును ప్రభావితం చేయడంలో , నిత్యం ఉల్లాసంగా ఉండడానికి ఈ పండ్లు దోహదం చేస్తాయి. దీనికి కారణం వీటిలో ఉండే రెస్వెట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ లే.
రక్తంలోని షుగర్ లెవెల్స్ ని సమతుల్య పరచడంలో మల్బెర్రీలోని సమ్మేళనాలు దోహదం చేస్తాయి. షుగర్ లెవెల్స్ ని సాధారణ స్థితికి తీసుకురావడానికి చైనాలో మల్బెర్రీలను ఔషధంగా వాడతారు. అంతేకాదు చర్మంపై ఏర్పడే ఎర్ర మచ్చలు మల్బరీ ఆకుల రసం రాసినట్టయితే తగ్గుతాయి. కర్కుమిన్, మల్బెర్రీ ఆకులను కలిపి తయారు చేసిన మిశ్రమం చర్మంపై కలిగే దురదలను తగ్గిస్తుందని రొమేనియన్ అధ్యయనాలు వెల్లడించాయి.
ఎండిన మల్బెర్రీలు ప్రోటీన్, విటమిన్ ‘C’, ‘K’, ఫైబర్, ఐరన్ లను కలిగి ఉంటాయి. కనుక వీటిని రోజులో ఎప్పుడైనా స్నాక్స్ గా తినవచ్చు. ఒకవేళ వీటి రుచి నచ్చకపోతే పండ్లలో ఉన్నంత మేరకు పోషకాలను కలిగి ఉండే వీటి ఆకులను కూడా ప్రయత్నించవచ్చు. మల్బెర్రీలలో కనుగొన్న ఆల్కలాయిడ్ లు రక్షక కణాలను చైతన్యపరుస్తాయి. తెల్ల రక్తకణాలు రోగనిరోధక వ్యవస్థను ఉద్దీపనకు గురి చేస్తాయి. ఈ రక్షక కణాలు రోగనిరోధక వ్యవస్థను అప్రమత్తం చేసి ప్రమాదాల నుండి కాపాడుతూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.