థైరాయిడ్‌ హార్మోన్లకు, రోగ నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేసే సెలీనియం.. వేటిలో ఉంటుందంటే..?

మన శరీరానికి అవసరమైన అనేక రకాల పోషకాల్లో సెలీనియం ఒకటి. ఇది మినరల్స్‌ జాబితాకు చెందుతుంది. అంటే ఇది సూక్ష్మ పోషకం అన్నమాట. దీన్ని మనం రోజూ తక్కువ మోతాదులో తీసుకున్నా చాలు.. ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. సెలీనియం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్‌ హార్మోన్లకు, రోగ నిరోధక శక్తికి అద్భుతంగా పనిచేసే సెలీనియం.. వేటిలో ఉంటుందంటే..?

1. మన శరీరంలో జరిగే జీవక్రియల వల్ల ఫ్రీ ర్యాడికల్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. వీటిని ఎప్పటికప్పుడు తటస్థం చేసేందుకు యాంటీ ఆక్సిడెంట్లు అవసరం. యాంటీ ఆక్సిడెంట్లు మనం తినే ఆహారాల వల్ల లభిస్తాయి. అయితే ఫ్రీ ర్యాడికల్స్‌ సంఖ్య పెరిగితే శరీరంలో కణాలు దెబ్బ తినడంతోపాటు గుండె జబ్బులు, టైప్‌ 2 డయాబెటిస్‌, క్యాన్సర్‌ వంటి సమస్యలు వస్తాయి. కనుక ఫ్రీ ర్యాడికల్స్‌ను తగ్గించాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాలను తినాలి. అయితే యాంటీ ఆక్సిడెంట్లకు సెలీనియం ఎంతగానో దోహదపడుతుంది. దీంతో ఫ్రీ ర్యాడికల్స్‌ మరింత వేగంగా నశిస్తాయి. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.

2. సెలీనియం ఉన్న ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే న్యూట్రోఫిల్స్, మాక్రోఫేజెస్‌, టి లింఫోసైట్స్‌ సరిగ్గా పనిచేయాలంటే సెలీనియం అవసరం అవుతుంది. వీటి వల్ల సూక్ష్మ క్రిముల దాడికి అడ్డుకట్ట వేయవచ్చు. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.

3. థైరాయిడ్‌ హార్మోన్ల పనితీరుకు సెలీనియం ఎంతో అవసరం. సెలీనియం ఉండే ఆహారాలను తీసుకుంటే థైరాయిడ్‌ హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. వీటివల్ల మెటబాలిజం మెరుగు పడుతుంది. జీర్ణక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. బరువు నియంత్రణలో ఉంటుంది.

4. క్యాన్సర్లు రాకుండా అడ్డుకునే శక్తి సెలీనియంకు ఉంది. ఇది శరీరంలో ఉండే క్యాన్సర్‌ కణాలను నాశనం చేసేందుకు సహాయ పడుతుంది. దీంతో క్యాన్సర్లు వృద్ధి చెందకుండా చూసుకోవచ్చు.

సెలీనియం మనకు ఎక్కువగా గుమ్మడికాయ విత్తనాలు, పుట్ట గొడుగులు, ఓట్స్, బాదంపప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు, మటన్‌ లివర్‌, చికెన్‌, రొయ్యలు, బ్రెజిల్‌ నట్స్‌, పనీర్‌, బ్రౌన్‌ రైస్‌, కోడిగుడ్లు వంటి ఆహారాల్లో లభిస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే మనకు సెలీనియం లభిస్తుంది. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.

సెలీనియం మహిళలకు రోజుకు 55 మైక్రోగ్రాముల వరకు అవసరం. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు రోజుకు 60 నుంచి 70 మైక్రోగ్రాముల వరకు సెలీనియం అవసరం అవుతుంది. అలాగే పురుషులకు రోజుకు 60 మైక్రోగ్రాముల వరకు సెలీనియం అవసరం అవుతుంది.

Admin

Recent Posts