Calcium Foods : మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది విటమిన్ డి సహాయంతో ఎముకలను దృఢంగా మార్చుతుంది. దంతాలను దృఢంగా ఉంచుతుంది. అయితే చాలా మంది ఆహారాలను సరిగ్గా తీసుకోవడం లేదు. దీంతో కాల్షియం లోపం ఏర్పడుతోంది. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కానీ కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ లోపం నుంచి బయట పడవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
ఇక కాల్షియం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి పాలు. పాలను తాగడం వల్ల కాల్షియం అధికంగా లభిస్తుందని చాలా మందికి తెలుసు. అయితే పాలను అందరూ తాగలేరు. కొందరికి పడవు. అయినప్పటికీ దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే కేవలం పాలలోనే కాదు, పలు ఇతర ఆహారాల్లోనూ కాల్షియం మనకు సమృద్ధిగా లభిస్తుంది. ఆ ఆహారాలను రోజూ తీసుకుంటే చాలు.. కాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు. ఇక కాల్షియాన్ని మనకు అందించే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు మన శరీరానికి రోజుకి ఎంత కాల్షియం అవసరం అవుతుందో చూద్దాం. 19-50 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి రోజుకు 2,500 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. 51 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రోజుకు 2,000 మిల్లీగ్రాములు కాల్షియం అవసరం అవుతుంది. ఇలా ఆయా వయస్సుల వారు రోజూ తమకు కాల్షియం సరిగ్గా లభించేలా చూసుకోవాలి. ఇక కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాల విషయానికి వస్తే.. తోటకూరలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ప్రస్తుతం ఆకుకూరలు చాలా విరివిగా లభిస్తున్నాయి. ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి తోటకూర సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఎముకల నిర్మాణానికి, అభివృద్ధికి కాల్షియం చాలా ముఖ్యమైనది. కనుక కాల్షియం బాగా లభించాలంటే.. తోటకూరను తీసుకోవాలి.
ఇక అంజీర్ పండ్లలోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. దీంట్లో కాల్షియంతోపాటు ఫైబర్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. రాత్రి సమయంలో రెండు అంజీర్ లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన అంజీర్ లని నీటితో సహా తినాలి. ఇలా అంజీర్ లను తినటం వలన కాల్షియం లోపం తగ్గటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు. దీంతో రక్తం బాగా తయారవుతుంది.
ఇక నువ్వులలో కూడా కాల్షియం సమృద్దిగా ఉంటుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతి రోజూ ఒక టీస్పూన్ నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. నువ్వులు, బెల్లం కలిపి కూడా తీసుకోవచ్చు. నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు. దీంతో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.
అలాగే ఓట్స్ లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఓట్స్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఓట్స్ లో కాల్షియం, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే కాల్షియం లోపం తగ్గడమే కాకుండా అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు. కార్న్ ఫ్లేక్స్ ను ఉదయం చాలా మంది తింటుంటారు. కానీ అవి అధికంగా క్యాలరీలను కలిగి ఉంటాయి. కనుక వాటికి బదులుగా ఓట్స్ ను తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. అనేక విధాలైన ప్రయోజనాలను పొందవచ్చు.